SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:59 pm Posted by : SHENARTHI MEDIA

ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మించాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గీత సూచించారు. మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో తెలంగాణ జలసిరి పోస్టర్‌ను సర్పంచులతో కలిసి ఆవిష్కరించి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు.

గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు కామన్ సోక్‌పిట్లు నిర్మించాలని సూచించిన ఆమె, వాటి ద్వారా మురికి కాలువల నుంచి దుర్వాసన వ్యాపించకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారసంతలు జరిగే ప్రాంతాల్లో కూడా మరుగుదొడ్ల ఏర్పాటు చేపట్టాలని సూచించారు.

జలసిరి కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, స్వశక్తి సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి లేని గ్రామాల కార్యదర్శులపై డీఆర్‌డీవో గీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్, ఏపీఓ శారద, ఏపీఎం శ్రీనివాస్, ఎస్‌బీఎం రమేష్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.