SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:39 pm Posted by : SHENARTHI MEDIA

కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

శెనార్తి మీడియా, బెజ్జంకి:

మండలంలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి అవసరమైన చోట కొత్త పోలింగ్ స్టేషన్లు, అదనపు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని బీజేపీ బెజ్జంకి మండల శాఖ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. అలాగే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు దూరంగా వెళ్లాల్సి వస్తోందన్నారు.

ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అదనపు బూత్‌లు, కొత్త పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

బెజ్జంకి గ్రామంలోని బూత్ నంబర్ 221లో 1,169 మంది ఓటర్లు ఉండటంతో అదనపు బూత్ ఏర్పాటు చేయాలని, గుండారం గ్రామంలోని బూత్ నంబర్ 315లో 1,204 మంది, బూత్ నంబర్ 316లో 1,232 మంది ఓటర్లు ఉన్నందున అక్కడ కూడా అదనపు బూత్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా రాంసాగర్‌కు ప్రత్యేక పోలింగ్ కేంద్రం, బెజ్జంకి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆమ్లెట్ గ్రామం, పాపన్నపల్లి, ఎల్లంపల్లి గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కల్లెపల్లి పరిధిలోని ఇట్టిరెడ్డిపల్లి, గుంటూరుపల్లి, తోటపల్లి పరిధిలోని శాలపల్లి, బేగంపేట–తలరువానిపల్లి పరిధిలో తలరువానిపల్లి–వెన్నవానిపల్లి గ్రామాలకు ఒక పోలింగ్ కేంద్రం, ఒడ్డార కాలనీ–మడుపువానిపల్లి ప్రాంతాలకు మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మండలంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఇప్పటికే 98 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. ప్రజల సౌకర్యం, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం తమ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను విజ్ఞప్తి చేశారు.