SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:07 pm Posted by : SHENARTHI MEDIA

ఉపసర్పంచ్‌ల డిమాండ్లపై వినతిపత్రం

ఉపసర్పంచ్‌ల డిమాండ్లపై వినతిపత్రం

శెనార్తి మీడియా, కరీంనగర్/శంకరపట్నం:

ఉపసర్పంచ్‌ల హక్కులు, బాధ్యతలను పరిరక్షించి స్థానిక సంస్థల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్‌లు అదనపు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై ఉపసర్పంచ్‌లు, సంబంధిత వార్డు సభ్యుల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామపంచాయతీ స్టాండింగ్ కమిటీలలో ఉపసర్పంచ్‌లను వైస్ చైర్మన్‌లుగా నియమించాలని, గ్రామపంచాయతీ తీర్మానాలపై ఉపసర్పంచ్‌ల సంతకాలను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా ఉపసర్పంచ్‌లకు ఉన్న హక్కులను పరిరక్షిస్తూ గ్రామాభివృద్ధిలో వారికి తగిన గుర్తింపు, అధికారాలు, గౌరవం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దుస్స కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్, జిల్లాలోని వివిధ మండలాల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.