SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 12:49 pm Posted by : SHENARTHI MEDIA

భారీ వర్షానికి ఇల్లు కూలి ముగ్గురికి గాయాలు

 

  • – ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
  •  ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని సజన్ కుమార్ భరోసా

శెనార్తి మీడియా, మంచిర్యాల:

కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆత్రం మంతయ్య నివాసం పూర్తిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండటంతో గోడలు వారిపై పడగా మంతయ్య భార్య లక్ష్మి, కుమారులు అజయ్, అనిల్ గాయపడ్డారు. ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనం కూడా శిథిలాల కింద పడి దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స కొనసాగుతోంది.

ప్రమాదం విషయం తెలుసుకున్న కోటపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎంబరి సజన్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటనను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్ రాఘవేందర్ రావుతో మాట్లాడి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు.

బాధిత కుటుంబానికి నష్టపరిహారం మంజూరు అయ్యేలా కృషి చేస్తామని, ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుందని సజన్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్నారని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యదర్శి పల్లె సత్తయ్య, సీనియర్ నాయకుడు ఓల్వోజీ శ్రీనివాస్ పాల్గొన్నారు.