శెనార్తి మీడియా, హుజురాబాద్:
ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సిర్సపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని వివరించారు. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అందిస్తున్న శాస్త్రీయ సూచనల మేరకు పంటల యాజమాన్యాన్ని చేపట్టాలని కోరారు. రైతుల సందేహాల నివృత్తి కోసం ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే “రైతు నేస్తం” కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ నిపుణుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను అనుసరించాలని సర్పంచ్ పోల్సాని రామారావు కోరారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ విధానాలతో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంపత్, ఉప సర్పంచ్ జనగామ రాజేష్ కుమార్, కరోబార్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.