శెనార్తి మీడియా, శంకరపట్నం:
వృద్ధాప్యంలో తమను మానసికంగా వేధించడం సరికాదని శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన నిమ్మశెట్టి వసంత, బాబురావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో సంపాదించిన వ్యవసాయ భూమిని 2021లో ఇద్దరు కుమారులకు తలా 2 ఎకరాల 20 గుంటల చొప్పున పంపిణీ చేశామని తెలిపారు. తమ జీవనాధారం కోసం ఇంటి స్థలంతో కలిపి 38 గుంటల భూమిని ఉంచుకున్నామని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇంటి పునర్నిర్మాణానికి ఇద్దరు కుమారులు చెరో రూ.లక్ష చొప్పున ఇస్తామని పెద్దమనుషుల సమక్షంలో అంగీకరించినప్పటికీ, చిన్న కుమారుడు తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇల్లు పూర్తిగా శిథిలం కావడంతో అప్పులు చేసి తామే నిర్మించుకున్నామని, ఆ అప్పులు తీర్చేందుకు తమ భూమిలో కొంత భాగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిన్న కుమారుడు తన పలుకుబడితో భూమి కొనుగోలుకు ఇతరులు ముందుకు రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. దీంతో పెద్ద కుమారుడిని ఒప్పించి గత నెలలో పెద్దమనుషుల సమక్షంలో బయానా తీసుకుని రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసినట్లు వివరించారు. రిజిస్ట్రేషన్ సమయంలో నాయబ్ తహసీల్దార్ ఇన్‌చార్జిగా ఉండటంతో విచారణ అనంతరం రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.
తాము చిన్న కుమారుడిని మోసం చేస్తున్నామంటూ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారసత్వంగా వచ్చిన భూమి కాదని, తమ కష్టార్జితంతో సంపాదించుకున్నదేనని స్పష్టం చేశారు. చిన్న కుమారుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటంతో తమకు ప్రభుత్వ పెన్షన్ కూడా రావడం లేదన్నారు. తమ వివరణ తీసుకోకుండా ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేయవద్దని, ప్రచారం కొనసాగితే చట్టపరంగా పోరాడతామని వృద్ధ దంపతులు హెచ్చరించారు.