SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:29 pm Posted by : SHENARTHI MEDIA

రైతుల పేరిట అక్రమంగా మట్టి తరలింపు

ఎమ్మెల్యే కవ్వంపల్లి, పీఏపై మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు

శెనార్తి మీడియా, శంకరపట్నం:

రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.

సోమవారం కేశవపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని చెరువుల మట్టిని రైతుల పంట పొలాలకు తరలించేందుకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, రైతుల పేరుతో సుమారు 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇతరులకు తరలించారని ఆరోపించారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించే చెరువులను మట్టి మాఫియాకు అప్పగించారని విమర్శించారు.

కల్వల ప్రాజెక్టుకు గండి పడి రైతులు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించిన రహదారుల్లో ఒక్కదానికి కూడా మరమ్మతులు చేయలేదని, ప్రస్తుతం గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారాయని పేర్కొన్నారు.

పోతిరెడ్డిపేట రోడ్డుకు రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను రద్దు చేసిందని విమర్శించారు. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా రహదారులు దారుణంగా ఉన్నాయని అన్నారు.