శెనార్తి మీడియా, శంకరపట్నం:
రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారానే రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు మొబైల్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి FFS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్ లేదా ఫార్మర్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి. అవసరమైన ఎరువుల బస్తాలను యాప్‌లో బుక్ చేసుకున్న అనంతరం వచ్చే క్యూ ఆర్ కోడ్‌ను సంబంధిత డీలర్ లేదా సొసైటీలో చూపించి ఎరువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు.
ఈ యాప్ జిల్లా యూనిట్‌గా పనిచేస్తున్నందున రైతులు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్, ఇతర అన్ని రకాల ఎరువుల కొనుగోళ్లకు కూడా ఈ యాప్‌నే వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు.
యాప్‌లో బుకింగ్ చేసుకునే సమయంలో రైతులకు ఏవైనా సందేహాలు లేదా సలహాలు అవసరమైతే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (AEO) సంప్రదించాలని ఏవో వెంకటేష్ సూచించారు.