SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:28 pm Posted by : SHENARTHI MEDIA

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు కోరారు. సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు సమావేశమై తమ డిమాండ్లను వెల్లడించారు.

ఆర్టీసీ పరిధిలోకి ఆటోలను తీసుకురావాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వపరంగా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంధనం, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటో మీటర్ చార్జీలను సవరించాలని సూచించారు.

ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. యాప్‌ల ద్వారా కొనసాగుతున్న టూవీలర్ రవాణా సేవలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో శంకరపట్నం మండలం ఆటో యూనియన్ కార్మిక సంఘం అధ్యక్షుడు సుంకర కిషోర్, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి అశోక్, నాయకులు చంద్రమౌళి, ప్రశాంత్, శ్రీకాంత్, అనిల్, రవి, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.