SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 6:42 pm Posted by : SHENARTHI MEDIA

పదేళ్లలో యూపీఐ చెల్లింపుల విప్లవం

  • ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు
  • వార్షిక లావాదేవీలు 1.78 కోట్ల నుంచి 24,162 కోట్లకు పెరుగుదల
  • డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతానికి చేరిక
  • 11 దేశాల్లో అందుబాటులో యూపీఐ
  • ప్రపంచ రియల్‌టైమ్‌ చెల్లింపుల్లో 49 శాతం వాటా

 శెనార్తి మీడియా డెస్క్:

భారత డిజిటల్‌ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆగస్టు 25తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. 2016లో ఎన్‌పీసీఐ ప్రారంభించిన యూపీఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు పొందిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారీగా పెరిగిన లావాదేవీలు

2016-17లో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీలు 2025-26లో 24,162 కోట్లకు చేరాయి. లావాదేవీల విలువ కూడా రూ.0.07 లక్షల కోట్ల నుంచి సుమారు రూ.314 లక్షల కోట్లకు పెరిగింది. దేశ డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతానికి చేరగా, రోజుకు సగటున 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.

11 దేశాలకు విస్తరణ

యూపీఐ ప్రస్తుతం 11 దేశాల్లో అందుబాటులో ఉంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రియల్‌టైమ్‌ చెల్లింపుల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పదేళ్లలోనే యూపీఐ భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో కీలక సాధనంగా నిలిచింది.