SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 4:13 pm Posted by : SHENARTHI MEDIA

420 హామీలు అమలు చేయాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ  బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీవో అనితకు సోమవారం వినతిపత్రం అందించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగం పెంచాలని వారు కోరారు. ముఖ్యంగా ఆడబిడ్డల వివాహానికి నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీ అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ప్రతి పంటకు రైతు భరోసా, పంటలకు బోనస్‌, 24 గంటల నిరంతర విద్యుత్‌ అందించాలని కోరారు.

రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల సాయం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలంతో పాటు పక్కా ఇల్లు, అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయాలని కోరారు. విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్‌ ఫీజు బకాయిల చెల్లింపు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్‌ అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల సాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రకటించిన డిక్లరేషన్లను అమలు చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు ప్రయోజనం కల్పించాలని వారు కోరారు.