SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:16 pm Posted by : SHENARTHI MEDIA

కొండయ్యపల్లి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

 

  • ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ సర్పంచులు వేధిస్తున్నారని ఆరోపణ

శెనార్తిమీడియా, కరీంనగర్ :

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్‌మల్యాల వినయ్ సాగర్ అలియాస్ తిరుపతి మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 33 మంది మండల సర్పంచులతో కూడిన వాట్సాప్‌గ్రూపులో తనను అవమానించేలా పోస్టులు పెట్టారని సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించారని, దీంతో తన ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను టార్గెట్‌చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. మండలంలోని కాంగ్రెస్‌పార్టీ సర్పంచులు తనను అవమానాలకు గురిచేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మధురానగర్‌చౌరస్తాలోని అంబేద్కర్‌విగ్రహం వద్దకు చేరుకున్న ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకులు గమనించి వెంటనే అడ్డుకున్నారు. సర్పంచ్‌చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కునేందుకు ప్రయత్నించగా మూత తెరిచి ఉండడంతో కొంత మందు అతడి నోట్లో పడింది. బీజేపీ నాయకులు, స్థానికులు వెంటనే ప్రైవేట్ వాహనంలో కరీంనగర్‌ సివిల్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
వినయ్ సాగర్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్
కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల వినయ్సాగర్ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా రవిశంకర్ దళిత సర్పంచ్పై జరుగుతున్న కుల దూషణ, రాజకీయ వేధింపులను ఖండించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం దారుణమన్నారు. వినయ్సాగర్ మేడిపల్లి సత్యం, అతని అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడతానని వీడియో విడుదల చేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, బెదిరింపులకు ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోందన్నారు. సత్యం కాంగ్రెస్ సర్పంచులకే నిధులు కేటాయించి, బీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ సర్పంచుకు అభివృద్ధి గురించి అడిగే హక్కు లేదా అని ప్రశ్నించారు. వినయ్ సాగర్ లేఖ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కులం పేరుతో దూషించిన సర్పంచులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. వినయ్ సాగర్ ప్రాణానికి, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.