SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 10:10 am Posted by : SHENARTHI MEDIA

అండర్‌పాస్ కోసం జాతీయ రహదారిపై ధర్నా

నేడు ఆర్డీవో విచారణకు హామీ.. రాకుంటే మళ్లీ ఆందోళనకు గ్రామస్తుల హెచ్చరిక

శెనార్తి మీడియా, శంకరపట్నం:
కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తగట్టు జాతీయ రహదారిపై రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అండర్‌పాస్ నిర్మాణం కోసం గత కొన్ని రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి దాటే క్రమంలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో టోల్‌గేట్‌ వద్దకు చేరుకుని రహదారిపై బైఠాయించారు. అండర్‌పాస్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్‌ఐ శేఖర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నేడు ఆర్డీవో వచ్చి విచారణ చేపడతారని అధికారులు హామీ ఇచ్చారు. ఆర్డీవో రాకపోతే మళ్లీ జాతీయ రహదారిపై ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు మాడ సుజాత, సాగి విద్యాసాగర్‌రావు, కొత్తగట్టు దేవస్థాన చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ మెంతుల సరోజన, మాజీ చైర్మన్లు రాజిరెడ్డి, తూముల శ్యాంరావు, ఉప సర్పంచులు వీరేందర్‌కుమార్, లతతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.