చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదా..?
ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
శెనార్తిమీడియా, గంగాధర :
పంటలు ఎండుతున్నా, చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి, తాడిజెర్రిలో ఎండుతున్న వరి పంటలను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వేసుకున్న పంటలను కాపాడే క్రమంలో వాటర్ ట్యాంకు కోసం రోజుకు రూ.3500– రూ.-4000లు వెచ్చించి నీరు పెడుతున్నారని రైతన్న పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రోజుకు 6 గంటల కరెంట్ సరఫరా చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మేచినేని నవీన్ రావు, రామిడి సురేందర్ రెడ్డి, కంకణాల విజేందర్ రెడ్డి, ఆకుల మధుసూదన్ తదితరులు ఉన్నారు.