SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 10:00 pm Posted by : SHENARTHI MEDIA

రామగుండంలో చేతులెత్తేసిన అధికారులు

  • సొంత నిధులతో రోడ్ల గుంతల పూడ్చివేయించిన కార్పొరేటర్
  • రోడ్ల మరమ్మతు కోసం ఆరు నెలలుగా అధికారులకు అర్జీలు
  • స్పందించని మున్సిపల్ యంత్రాంగం

శెనార్తి మీడియా, రామగుండం:
రామగుండం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రోడ్ల గుంతలను పూడ్చేందుకు నగరంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా మహేష్ స్వయంగా ముందుకొచ్చారు. ఆరు నెలలుగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సుమారు రూ.లక్ష సొంత నిధులతో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు.

డివిజన్‌లో రోడ్లు గుంతలమయంగా మారి స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేయడంతోపాటు గుంతలకు నాలుగుసార్లు కొలతలు తీసి అంచనాలు సిద్ధం చేసినా పనులు ప్రారంభించలేదన్నారు. 15 రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ ఈఈని సంప్రదించగా గుంతల్లో సిమెంట్ వేయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికి ఏఈని దాదాపు 50 సార్లు అడిగినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు వేడుకలు నిర్వహించే ప్రాంతంలోనైనా గుంతలు పూడ్చాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ప్రచారానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు చేపట్టి ప్రజలకు కనీస రహదారి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 51వ డివిజన్‌లో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని ఆకారపు రేఖా మహేష్ స్పష్టం చేశారు.