SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 10:20 am Posted by : SHENARTHI MEDIA

‘దుబాయ్’లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం : గోవర్ధన్ రెడ్డి
శెనార్తిమీడియా, కరీంనగర్ :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని విల్లా నోవా కమ్యూనిటీలో తెలంగాణ ప్రవాసుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిని ఆరాధించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశీ గడ్డపై సైతం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు చప్పట్లు కొడుతూ లయబద్ధంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యతను మరింత బలోపేతం చేయడం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణ పండుగలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డి, విల్లా నోవా కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.