శెనార్తి మీడియా, రామడుగు:
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థి బొడ్ల మణి కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఆడెపు మనోజ్ కుమార్ తెలిపారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ పోటీల్లో మణి కార్తీక్ కరీంనగర్ జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచాడు. దీంతో ఈ నెల 27 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్‌లోని ఉమ్రై జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ఎంఈవో రంగనాథశర్మ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి బన్సీలాల్, సర్పంచ్ ఎండీ మోయిజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాసరవేణి లక్ష్మణ్, వైస్ ప్రిన్సిపల్ రమేశ్, పీఈటీలు అభినందించారు.