- బీజేపీ నాయకుల రాస్తారోకో.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
శెనార్తి మీడియా, శంకరపట్నం:
పంటలు ఎండిపోయి, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న శంకరపట్నం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గురువారం కేశవపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
కరువు పరిస్థితులు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా?
మండలంలో రైతులు సాగుకు దూరమవుతూ, పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతుంటే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రైతుల కష్టాలు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు మండలాల ఎంపికలో సరైన గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. అత్యల్ప వర్షపాతం నమోదై, సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న శంకరపట్నం మండలాన్ని జాబితాలో చేర్చకపోవడం అన్యాయమన్నారు.
రబీ సాగుపైనా నీటి కొరత ప్రభావం
కాకతీయ కాలువ దిగువ ప్రాంతంలో శంకరపట్నం మండలానికి ప్రస్తుత వానకాలం సీజన్లో కాలువ ద్వారా ఒక్కసారి కూడా నీరు విడుదల చేయలేదన్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయని, రాబోయే రబీ సీజన్లోనూ కాలువ నీరు అందే పరిస్థితి లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ధర్నాలో బీజేపీ జిల్లా నాయకులు అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, రాసమల్ల శ్రీనివాస్, కొయ్యడ అశోక్, మందాడి జగ్గారెడ్డి, బిజిలి సారయ్య, చెర్ల శ్రీనివాస్, నిమ్మశెట్టి సంపత్, వివిధ మోర్చాల మండల విభాగం అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.