SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:04 pm Posted by : SHENARTHI MEDIA

స్మార్ట్ కార్డులో ఊరినే మార్చేశారు..

  • కొత్త రేషన్ కార్డుల్లో మారిన గ్రామం పేరు
  • లబ్ధిదారుల ఆందోళన
  • సవరించాలని డిమాండ్

శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి జారీ చేసిన కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో గ్రామం పేరే మారిపోవడం కలకలం రేపుతోంది. దాదాపు 40 ఏళ్లుగా ప్రత్యేక గ్రామపంచాయతీగా కొనసాగుతున్న వంకాయగూడెం పేరుకు బదులుగా కార్డుల్లో రెవెన్యూ గ్రామం కేశవపట్నం అని నమోదు చేయడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం గ్రామపంచాయతీలో స్మార్ట్‌ కార్డులు అందుకున్న గ్రామస్థులు ఈ పొరపాటును గుర్తించారు. ప్రత్యేక గ్రామపంచాయతీగా వంకాయగూడెం కొనసాగుతున్నప్పుడు కొత్త కార్డుల్లోనూ అదే పేరు ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామం పేరును మార్చి కేశవపట్నంగా నమోదు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి కార్డుల్లో చోటుచేసుకున్న తప్పులను సరిచేయాలని, వంకాయగూడెం పేరుతోనే కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జారీ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.