SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:42 pm Posted by : SHENARTHI MEDIA

ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీకొని ఐదుగురికి గాయాలు

ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశం

శెనార్తిమీడియా, కరీంనగర్​ :

కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గ్రానైట్ బండరాయి కోసం వెళ్తున్న కంటైనర్​ ను కరీంనగర్​ వన్​ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్‌, ఐదుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని 108లో కరీంనగర్ సివిల్​ హాస్పిటల్​ కు తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆర్డీవో షర్మిల ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా  సిరిసిల్లకు వెళ్తున్న ఈ బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. బావుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్టీసీ ఎండీ, పోలీస్ కమిషనర్‌ గౌష్​ ఆలంతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.