రామడుగు మండలం మోతెలో ఎండిన పంటల పరిశీలన
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
శెనార్తిమీడియా, రామడుగు :
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి చాడ వెంకటరెడ్డి ఎండిపోయిన పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయని, వర్షపాతం తక్కువ నమోదు కావడం మూలంగా రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, ఎకరాకు రూ.30 వేల నుండి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి వరి పంట వేస్తే సాగునీరు అందక, వర్షాలు కురవక ఆ పంటలు ఎండిపోతున్నాయన్నారు. రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన లత అనే మహిళ ఒక ఎకరం పదిహేను గుంటలు పొలం వేస్తే పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని తమతో ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడానికి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా అందించాలని చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణయ్య ప్రతిపాదన చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ బృందాలు కరువు ప్రాంతాల్లో పర్యటించి, రైతుల కష్టాలను ఎండిపోయిన పంటలను ప్రత్యక్షంగా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, ఈ నెల 10న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, సీపీఐ రామడుగు మండల కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మచ్చ రమేశ్, అందె చిన్న స్వామి, మాజీ మండల కార్యదర్శి గొడిసెల తిరుపతి గౌడ్, నాయకులు వేముల మల్లేశం, మచ్చ నర్సయ్య, గోలి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.