శెనార్తిమీడియా, కొత్తపల్లి :
గంజాయి విక్రేతలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారుక్ కొంతకాలంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొని కరీంనగర్ తీసుకువచ్చి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విద్యార్థులు, ఇతరులకు అమ్ముతూ అక్రమార్జన చేస్తున్నారు. 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద రూ.20 వేలకు కిలో చొప్పున 2.2 కిలోల గంజాయి కొని, రేకుర్తికి తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి కిలో రూ.50 వేలకు అమ్మడానికి సిద్ధం చేశారు. చేతి సంచిలో 2.2 కిలోల గంజాయితో రేకుర్తి సమ్మక్క గద్దెల వద్ద కెనాల్ వెంట నడుచుకుంటూ వెళ్తుండగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానంతో వారిని పట్టుకుని విచారించగా సంచిలో ఉన్న రెండు కిలోల గంజాయిని పట్టుబడింది. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వారికి పట్టుకున్న ఎస్సై సాంబమూర్తి, హెడ్ కానిస్టేబుల్స్ హరి కేశవ్, పరశురాములు, కానిస్టేబుల్ శ్రీనాథ్, వెంకటేష్, శ్రీనివాస్, శివను సీఐ అభినందించారు.