SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 11:48 pm Posted by : SHENARTHI MEDIA

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం

  • నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి
  • ప్రతి గ్రామంలో కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
  • కేశవపట్నం ఎస్సై కె. శేఖర్ రెడ్డి

శెనార్తి మీడియా శంకరపట్నం:

గ్రామాల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కేశవపట్నం ఎస్సై కె. శేఖర్ రెడ్డి తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలో కెమెరాల ఫుటేజీ ఉపయోగపడుతుందని వివరించారు.

శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు కమ్యూనిటీ సీసీ కెమెరాలను హుజూరాబాద్ రూరల్ సీఐ ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలను పర్యవేక్షించేలా వీటిని ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం ముందుకొచ్చిన సర్పంచ్, పాలకవర్గ సభ్యులను సీఐ అభినందించారు.

అన్ని గ్రామ పంచాయతీల్లోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ సూచించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థల యజమానులు కూడా నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత, సురక్షిత గ్రామాలను నిర్మించగలమని ఎస్సై పేర్కొన్నారు.