SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 7:30 pm Posted by : SHENARTHI MEDIA

చివరి బంతి దాకా ఉత్కంఠ.. అండర్-19 ఆసియా కప్ యువ భారత్ కైవసం

  • ఫైనల్లో పాకిస్థాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో విజయం
  • 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత యువ జట్టు
  • ఆర్యవీర్‌, లక్షయ్‌, మనల్‌ కీలక ఇన్నింగ్స్‌లు
  •  49 పరుగులతో అజేయంగా నిలిచిన మోహిత్‌ ఉల్వా 

    అండర్‌-19 ఆసియా కప్‌ 2026లో భారత యువ జట్టు మరోసారి సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఒక్క వికెట్‌ తేడాతో ఓడించి పదోసారి ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత ఫైనల్‌తో పాటు ఈ టోర్నీలో గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌ చేతిలో ఎదురైన ఓటములకు భారత్‌ బదులు తీర్చుకుంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాన్‌ 111 బంతుల్లో 107 పరుగులతో సెంచరీ సాధించగా, అబ్దుల్‌ ఖాదిర్‌ 54 బంతుల్లో 80, కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసుఫ్‌ 60 బంతుల్లో 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కావ్య పటేల్‌ 68 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, చిగురుపాటి వెంకట్‌ మూడు వికెట్లు తీశాడు.

338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, కెప్టెన్‌ లక్షయ్‌ రైచందానీ శుభారంభం అందించారు. గాయంతో బాధపడుతున్నప్పటికీ బ్యాటింగ్‌ కొనసాగించిన ఆర్యవీర్‌ 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మరోవైపు లక్షయ్‌ 101 బంతుల్లో 80 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత మధ్య వరుస బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరుకుంది.

ఈ కీలక దశలో మోహిత్‌ ఉల్వా, మనల్‌ చౌహాన్‌ జట్టుకు అండగా నిలిచారు. తొమ్మిదో వికెట్‌కు కేవలం 35 బంతుల్లోనే 57 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకెత్తించారు. మనల్‌ 32 బంతుల్లో 47 పరుగులతో విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ఔటైనా మోహిత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాడు.

చివరి వికెట్‌కు చిగురుపాటి వెంకట్‌తో కలిసి మోహిత్‌ 16 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. దీంతో భారత జట్టు మరో వికెట్‌ మాత్రమే మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించింది. మోహిత్‌ 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు సమష్టి పోరాటంతో విజయం సాధించి పదోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచారు.

స్పోర్ట్స్ డెస్క్, శెనార్తి మీడియా: