వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు
శెనార్తిమీడియా, రామడుగు :
మాజీ ప్రధాని, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు కొనియాడారు. దేశ సమగ్రత, అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. జీపీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు దేశ ఆర్థిక, సామాజిక రంగాలపై చెరగని ముద్ర వేశాయని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.