SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:56 pm Posted by : SHENARTHI MEDIA

బెల్ట్ షాపులు మూసేయాలని మహిళల ఆందోళన

శెనార్తి మీడియా, శంకరపట్నం:

తమ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని శంకరపట్నం మండలం కాచాపూర్ మహిళలు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సర్పంచ్ ఊకంటి మాధవికి తమ సమస్యలను వివరించారు. గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా యువకులు, కూలీలు మద్యానికి అలవాటుపడి సంపాదనంతా తాగుడుకే ఖర్చు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అక్రమ మద్యం విక్రయాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై సర్పంచ్ ఊకంటి మాధవి స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలైతేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని, ఒక్క గ్రామంలోనే పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేయడం కష్టమని పేర్కొన్నారు. అయినప్పటికీ మహిళల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని రెండు రోజుల్లో గ్రామసభ ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల మూసివేతపై గ్రామస్తుల అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.