వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు
భర్త, మనవడి అరెస్ట్
హత్యకు ఉపయోగించిన చీర స్వాధీనం
శెనార్తిమీడియా, గంగాధర :
గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దోమకొండ శంకరమ్మ (70)ను తన భర్త రామయ్యనే హతమార్చారు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం రంగారావుపల్లికి చెందిన శంకరమ్మ ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు ఆమె దహన సంస్కారాలు పూర్తిచేశారు. శంకరమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా చట్టపరమైన అనుమతులు పొంది శంకరమ్మ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి భర్త దోమకొండ రామయ్య, మనవడు, కోడలి పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా డబ్బులు, బంగారంపై దురాశతో భర్త దోమకొండ రామయ్య హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
డబ్బులు ఇస్తానని ఆశజూపి..
దోమకొండ రామయ్య అతని భార్య శంకరమ్మ కుటుంబ కలహాల కారణంగా కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. శంకరమ్మ కూలి పనులు చేసుకుంటూ సంపాదించిన డబ్బులు తనకు ఇవ్వడం లేదని రామయ్య ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె వద్ద ఉన్న డబ్బులు, బంగారం పొందాలనే దురాశతో తన భార్యను చంపితే డబ్బులు, బంగారం తనకే వస్తుందని, తన మనవడికి మద్యం, సిగరెట్లు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇస్తానని ఆశ చూపించి హత్యకు సహకరించేలా ప్రేరేపించాడు. ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామయ్య తన భార్య శంకరమ్మను వెనుక నుంచి నడుం భాగంలో బలంగా కొట్టి కింద పడవేయగా మనవడు చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. రామయ్య చీరను ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా శంకరమ్మ అనారోగ్యంతో రక్తం కక్కి మరణించిందని అందరినీ నమ్మించారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

పోలీసుల విచారణతో అసలు విషయాలు వెలుగులోకి..
శంకరమ్మ మృతిపై ఆమె పెద్ద కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న చొప్పదండి ఇంచార్జి సీఐ కోటేశ్వర్, తహసీల్దార్ అంబటి రజిత, వైద్యాధికారి విజయ్ సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు ఆధారాలు, విచారణ ద్వారా హత్యకు పాల్పడిన వారిని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.