SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 3:30 pm Posted by : SHENARTHI MEDIA

డిసెంబర్ 1 నుంచి కాచాపూర్‌లో మద్యం విక్రయాలు నిషేధం

బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం
శెనార్తి మీడియా, శంకరపట్నం:
మద్యం విక్రయాల వల్ల కుటుంబాల్లో తలెత్తుతున్న సమస్యలను అరికట్టి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మద్యం సేవించడం వల్ల కుటుంబాల్లో గొడవలు పెరుగుతున్నాయని, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు పంచాయతీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మద్యం మత్తులో కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లో ఘర్షణలకు దిగడం వంటి పరిణామాలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గురువారం సర్పంచి మాధవి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం డిసెంబర్ 1 నుంచి బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని సభలో నిర్ణయించారు. ఈ మేరకు నిర్వాహకులకు రెండు రోజుల గడువుతో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామసభ నిర్ణయాన్ని ఉల్లంఘించి బెల్ట్ షాపులు నిర్వహించినా, మద్యం విక్రయాలు కొనసాగించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సర్పంచి మాధవి, ఉపసర్పంచి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల భద్రత, గ్రామ సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.