SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 7:29 pm Posted by : SHENARTHI MEDIA

మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

  • బంగారు ఆభరణాల కోసం ఆలయంలోనే కత్తితో హత్య
  • ఒక్కొక్కరికి రూ.9 వేల జరిమానా
  • కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2026లో 32వ శిక్ష

శెనార్తి మీడియా, శంకరపట్నం:

బంగారు ఆభరణాల కోసం మహిళను కిడ్నాప్ చేసి కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.9 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం (నవంబర్ 27) తీర్పు వెలువరించింది.

పూజారి వద్దకు తీసుకెళ్తామని నమ్మించి..

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల (58), ఆమె తండ్రిని పూజలు చేయిస్తామని నమ్మించి 2023 అక్టోబర్ 1న మధ్యాహ్నం 2.30 గంటలకు నిందితులు ఆటోలో తీసుకెళ్లారు. అనంతరం గ్రామంలోని శివాలయం ప్రాంగణానికి చేర్చారు. అక్కడ ఏ-1 షేక్ గౌస్ పాషా కత్తితో బెదిరించి ప్రమీల బంగారు ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, ఒక చెవి దిద్దును అపహరించాడు. వీటి బరువు సుమారు 27.2 గ్రాములు. అనంతరం ఏ-2 వంకడాయ్ మోహన్, ఏ-3 మహమ్మద్ నూర్జహాన్ బేగంతో కలిసి ఆటోలో పరారయ్యాడు.

మూడు రోజుల్లోనే నిందితుల అరెస్ట్

ఈ ఘటనపై కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 180/2023తో ఐపీసీ 365, 302, 392, 397 సెక్షన్లతో పాటు 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు 2023 అక్టోబర్ 4న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఆటో, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయగా, ఎస్సీ నంబర్ 58/2024గా విచారణ కొనసాగింది.

పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026లో నమోదైన కేసుల్లో ఇది 32వ శిక్ష కావడం విశేషం. కేసులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. ప్రతాప్, అప్పటి దర్యాప్తు అధికారి, హుజూరాబాద్ రూరల్ సీఐ బి. సంతోష్ కుమార్, ప్రస్తుత సీఐ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్‌హెచ్‌ఓ ఎన్. నరేష్ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి. కరుణాకర్, సీఎంఎస్ ఏఎస్ఐ ఎం. సత్తయ్యలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఏసీపీ మాధవి పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు.