- ‘శెనార్తి మీడియా’ కథనానికి స్పందించిన ఆర్టీసీ అధికారులు
- మరుగుదొడ్లను శుభ్రం చేయించిన హుజరాబాద్ డీఎం
- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరిక
Sulabh Complex: కేశవపట్నం బస్టాండ్‌లోని సులభ్ కాంప్లెక్స్ దుస్థితిపై ‘శెనార్తి మీడియా’లో వచ్చిన కథనానికి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి, దుర్వాసన వెదజల్లుతుండటం.. ముఖ్యంగా మహిళా టాయిలెట్లకు తాళం వేసి ఉండటంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను కథనం వెలుగులోకి తెచ్చింది.

ఈ వార్తపై సానుకూలంగా స్పందించిన హుజరాబాద్ డిపో మేనేజర్ (డీఎం) రవీంద్రనాథ్ గురువారం కేశవపట్నం బస్టాండ్‌ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ఆయన, వెంటనే మూసి ఉన్న మరుగుదొడ్ల తాళాలు తీయించి శుభ్రం చేయించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్వహణలో మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్ ఆవరణను నిరంతరం శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియాకు, అధికారుల తక్షణ స్పందనకు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం
