Thursday, July 30, 2026
📄 ePaper
Homeజాతీయo7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ..

7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ..

📰 Generate e-Paper Clip

  •  కర్ణాటకలో కలకలం
  • యువతలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం
  • 18–25 ఏళ్ల వయసు వారిలో 7 వేలకుపైగా కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో ప్రత్యేక అవగాహన, ఆరోగ్య శిబిరాలు
  • విద్యార్థి సమ్మతితోనే హెచ్‌ఐవీ పరీక్షలు
  • క్యూఆర్ కోడ్ ద్వారా సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్ సౌకర్యం
  • ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యం

శెనార్తి మీడియా, వెబ్ డెస్క్::

కర్ణాటకలో యువతలో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా 18 నుంచి 25 ఏళ్ల  లోపు  గల విద్యార్థులు, యువకులు ఏడు వేలకు మందికి పైగా హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో  కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమై అత్యవసర చర్యలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో హెచ్‌ఐవీపై అవేర్నెస్  కార్యక్రమాలు, కౌన్సెలింగ్, స్వచ్ఛంద పరీక్షా శిబిరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యార్థుల పూర్తి సమ్మతి లేకుండా ఎలాంటి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.

కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు

కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం సిఫార్సుల మేరకు విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం, కాలేజియేట్ విద్యాశాఖ సంయుక్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నాయి. హెచ్‌ఐవీపై అవగాహన కల్పించడం, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం గణాంకాల ప్రకారం 18 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో హెచ్‌ఐవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2023–24లో 44,500 మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 66,600కు చేరింది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల 7 వేలకుపైగా విద్యార్థులు, యువత ఇటీవల హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

దేశంలో మూడో స్థానంలో కర్ణాటక

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి సంఖ్యలో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా, వారిలో 2.05 లక్షల మంది మాత్రమే యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స పొందుతున్నారు. మరో 54 వేల మందికి తమకు హెచ్‌ఐవీ సోకిన విషయం తెలియకపోవచ్చని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.

స్వచ్ఛంద పరీక్షలకే ప్రాధాన్యం

కాలేజీల్లో హెచ్‌ఐవీ పరీక్షా శిబిరాలు నిర్వహించినప్పటికీ పరీక్షలు తప్పనిసరి కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థి పూర్తి అవగాహనతో అంగీకారం తెలిపిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. వ్యక్తిగత గోప్యతను పరిరక్షిస్తూ స్వచ్ఛంద పరీక్షలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

క్యూఆర్ కోడ్‌తో రిస్క్ అంచనా

హెచ్‌ఐవీపై అవగాహన పెంచేందుకు కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం క్యూఆర్ కోడ్ ఆధారిత సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ ప్రమాద స్థాయిని గోప్యంగా అంచనా వేసుకోవడంతో పాటు అవసరమైతే సమీపంలోని పరీక్షా కేంద్రాలు, ఆరోగ్య సేవల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

‘ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమం

‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించడం, పాజిటివ్‌గా నిర్ధారణైన ప్రతి ఒక్కరికీ చికిత్స అందించడం, వైరల్ లోడ్‌ను నియంత్రణలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు. యువతలో హెచ్‌ఐవీ వ్యాప్తిని తగ్గించేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.