శెనార్తి మీడియా, శంకరపట్నం:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి కాచాపూర్ గ్రామంలో చికెన్ సెంటర్ అడ్డంకిగా మారింది. మంగళవారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సోమవారం ఏర్పాట్లు చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారు. అయితే రహదారిని ఆనుకుని ఓ వ్యక్తి చికెన్ సెంటర్‌తో పాటు బెల్టు షాపు నిర్వహిస్తుండటంతో మొక్కలు నాటే పనులకు ఇబ్బంది ఏర్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన చికెన్ సెంటర్‌ను తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయినా వ్యాపారి స్పందించకపోవడంతో సోమవారం పంచాయతీ పాలకవర్గం మరోసారి అక్కడికి వెళ్లి దుకాణాన్ని తొలగించాలని సూచించింది.
అయినప్పటికీ చికెన్ సెంటర్‌ను తొలగించకపోవడంతో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహణకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు రహదారి ఆక్రమణను తొలగించి మొక్కలు నాటేందుకు అనుకూల పరిస్థితులు కల్పించాలని మండల అధికారులను కోరారు

