శెనార్తి మీడియా, శంకరపట్నం:
జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నుంచి గ్రామస్థుల ప్రాణాలను కాపాడాలని, కొత్తగట్టు జంక్షన్ వద్ద తక్షణమే అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రధాన చౌరస్తా వద్ద రోజుకు 100 మందితో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అండర్‌పాస్ సాధన సమితి నాయకులు తెలిపారు.
జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామం రెండుగా విడిపోయిందని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు, రైతులు, వృద్ధులు రహదారి దాటే సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అండర్‌పాస్ మంజూరు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరసనలో భాగంగా గ్రామంలోని 10 వార్డుల నుంచి రోజుకో వార్డుకు చెందిన 10 మంది చొప్పున నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. వారికి మద్దతుగా మిగిలిన వార్డుల నుంచి మరో 90 మంది ప్రతిరోజూ దీక్షా శిబిరంలో పాల్గొంటారు. ఈ విధంగా నిత్యం 100 మందితో శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సాధన సమితి నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన అండర్‌పాస్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

