రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే సైకిల్ యాత్ర
గంగాధరలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
శెనార్తిమీడియా, గంగాధర :
కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులకు సాగునీరందించాలని, రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే సైకిల్ యాత్ర చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. సైకిల్ యాత్ర బృందానికి శనివారం రాత్రి ఆయన ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం యాత్రను మళ్లీ ప్రారంభించి మాట్లాడారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు సుమారు 400 కిలోమీటర్ల మేర బీఆర్ఎస్ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రాజెక్టుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో చిన్నపాటి సమస్యను చూపిస్తూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, గోలివాడ, నంది, గాయత్రి పంప్‌హౌస్‌లతో పాటు మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు విస్తరించిన సమగ్ర ప్రాజెక్టు అని వివరించారు. కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద అవసరమైన చిన్నపాటి మరమ్మతులు చేపట్టి పంపులు ప్రారంభిస్తే రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. రోజుకు సుమారు 20 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాత్రలో భాగంగా గ్రామాల్లో రైతులను కలుస్తున్నామని, సాగునీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువుల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులకు అందిన భరోసా, సాగునీటి సౌకర్యాలు తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

