Thursday, July 30, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి:సీపీ అంబర్ కిషోర్ ఝా

భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి:సీపీ అంబర్ కిషోర్ ఝా

📰 Generate e-Paper Clip

  •  వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటన
  • ప్రమాదకర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ముందస్తు చర్యలు

శెనార్తి మీడియా, మంచిర్యాల:

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బుధవారం మంచిర్యాల జోన్ పరిధిలోని పాత మంచిర్యాల వద్ద రాళ్లవాగును పరిశీలించిన అనంతరం ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

రాళ్లవాగులో వరద ఉద్ధృతి పెరగడంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సీపీ తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర ప్రాంతాలను మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని, పరిస్థితిని బట్టి మరికొన్ని మార్గాల్లో రాకపోకలను కూడా నిలిపివేస్తామని వెల్లడించారు.

వాతావరణ శాఖ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైతే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పొందిన సుమారు 30 మంది సిబ్బంది అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని సీపీ వెల్లడించారు. గత ఏడాది వరదల సమయంలో బోట్ల సహాయంతో గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా పోలీసులు వెంటనే స్పందిస్తారని తెలిపారు.

ఈ పరిశీలనలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.