శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో వ్యవసాయ మోటార్ల చోరీలు రైతులను కలవరపెడుతున్నాయి. రైతు వనపర్తి రాజేశంకు చెందిన మోటార్ పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీకి గురికావడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రాజేశం తన పొలానికి సాగునీరు అందించేందుకు సమీపంలోని యూటీ నుంచి నీటిని తోడుకునేలా మోటార్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 16న గుర్తుతెలియని వ్యక్తులు ఆయన మోటార్‌తో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతుల మోటార్లను ఎత్తుకెళ్లారు. పంటను కాపాడుకునేందుకు ఇతర రైతుల నుంచి మోటార్ అప్పుగా తీసుకుని తిరిగి ఏర్పాటు చేసుకోగా, మంగళవారం రాత్రి దానిని కూడా దుండగులు చోరీ చేశారు.
పంట పొట్ట దశకు చేరుకోవడం, యూటీలో నీరు అడుగంటడంతో రాజేశం ఇతర రైతుల బావుల నుంచి నీటిని సేకరిస్తూ పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సమయంలో వరుసగా మోటార్లు చోరీకి గురికావడంతో కరీంపేట రైతుల్లో ఆందోళన నెలకొంది.
పోలీసులు స్పందించి మోటార్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన మోటార్లను తిరిగి స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

