చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్ ఆలం
గుజ్జేటి మహేశ్ విగ్రహానికి ఘన నివాళి
శెనార్తిమీడియా, గంగాధర/ రామడుగు :
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్‌లోని అమరవీరుడు గుజ్జేటి మహేశ్ విగ్రహానికి సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య జరిగిన బలిమెల దుర్ఘటనలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన మహేశ్ సేవలను కొనియాడారు. అనంతరం అమరుడి కుటుంబసభ్యులకు దుస్తులు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుధాలు, పోలీస్ సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ ఉద్యోగం అంటేనే అత్యున్నత క్రమశిక్షణ, త్యాగనిరతితో కూడుకున్నదని, సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, గంగాధర, చొప్పదండి, రామడుగు ఎస్సైలు వంశీకృష్ణ, రాజ్‌కుమార్, రాజు, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము పాల్గొన్నారు.

సినిమా షూటింగ్ పరిశీలన
రామడుగు మండలం వెలిచాలలో జరుగుతున్న శెనార్తి సినిమా షూటింగ్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ నాగదుర్గ, డైరెక్టర్ గణేష్ ను అభినందించారు. పల్లెటూరు వాతావరణంలో సినిమా తీయడం సంతోషంగా ఉందన్నారు. సినిమా హిట్ కావాలని కోరుతూ ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట స్థానిక సర్పంచ్ వీర్ల నర్సింగారావు, పంచాయతీ పాలకవర్గం, నాయకులు ఉన్నారు.


