Saturday, August 1, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, కరీంనగర్:

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి, జీవో నెం. 9ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ డిమాండ్ చేశారు.

జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

జీవో నెం. 9 ద్వారా కళాశాలలు నేరుగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చనే విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, గతంలో అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగించాలని కోరారు. బీటెక్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ సహా వివిధ కోర్సులు చదువుతున్న పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ సహాయంపైనే ఆధారపడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తేవడం వల్ల అనేక కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని అన్నారు.

పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, జీవో నెం. 9ను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, జిల్లా సహాయ కన్వీనర్ షేక్ వాజిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ అభిలాష్ పటేల్, సాయి యాదవ్, సోషల్ మీడియా కో-ఇన్‌చార్జ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.