Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణ22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై కుట్ర..!

22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై కుట్ర..!

📰 Generate e-Paper Clip

  • తప్పు చేసింది కాంగ్రెస్‌ సర్కారే.. బాధితులనే కార్యాలయాల చుట్టూ తిప్పుతారా..?
  • మంచిర్యాలలో 10 వేల ఇళ్లు.. 6,222 సింగరేణి కార్మికుల సేల్‌డీడ్లు కూడా బ్లాక్‌
  • 5,525 ఎకరాలపై లెక్క చెప్పాలి.. వైట్‌పేపర్‌ విడుదల చేయాలి
  •  ప్రజల హక్కులు పునరుద్ధరించే వరకు పోరాటం:
  • మాజీ మంత్రి హరీశ్‌రావు

శెనార్తి మీడియా , మంచిర్యాల:

22ఏ నిషేధిత జాబితా పేరుతో సామాన్యుల ఆస్తులను బ్లాక్‌ చేసి వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టారని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వం డబ్బులు తీసుకుని పట్టాలు ఇచ్చిన భూములు, రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తులు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్లను 22ఏ జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పుకు బాధిత ప్రజలే మీ-సేవ, తహసీల్దార్‌, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మంచిర్యాల మార్కెట్‌ ఏరియాలో నిర్వహించిన సభలో జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావుతో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు.

– 98 శాతం తొలగించామంటే నమ్మేదెలా..?

22ఏ జాబితాలోని 98 శాతం ఆస్తులను తొలగించామని ప్రభుత్వం చెబుతున్నదని, మరి మంచిర్యాలలోని వేలాది ఇళ్ల పరిస్థితి ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. జిల్లాలో ఎన్ని ఇళ్లు, ప్లాట్లు, దుకాణాలు 22ఏలో ఉన్నాయో.. వాటిలో ఎన్ని తొలగించారో ప్రభుత్వం లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాలలో సుమారు 10 వేల ఇళ్లు 22ఏ సమస్యతో ప్రభావితమవుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

– సీఎం ఇంటికి ఒక న్యాయం.. సామాన్యుడికి మరో న్యాయమా..?

ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించిన ఆస్తిని నిషేధిత జాబితా నుంచి తొలగించగలిగినప్పుడు సామాన్యుల ఇళ్లను ఎందుకు తొలగించలేరని హరీశ్‌రావు నిలదీశారు. సీఎం ఆస్తి విషయంలో ప్రభుత్వం తప్పును గుర్తించి స్వయంగా చర్యలు తీసుకుంటే.. పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తుల విషయంలోనూ అదే విధానం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. చట్టం అందరికీ ఒకటే కావాలి. ముఖ్యమంత్రికి ఒక న్యాయం.. సామాన్యుడికి మరో న్యాయం ఉండకూడదు అని స్పష్టం చేశారు.

– 6,222 సింగరేణి కార్మికుల హక్కుల సంగతేంటి..?

సింగరేణి కార్మికుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని తీసుకుని, 6,222 మందికి రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్ల ద్వారా ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించిన విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. ప్రభుత్వం డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసి పత్రాలు ఇచ్చిన భూములను ఇప్పుడు 22ఏలో చేర్చడంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు ప్రభుత్వ పత్రాలను నమ్ముకుని ఇళ్లు నిర్మించుకున్నారని, ఇప్పుడు వాటిపై అమ్మకం, రిజిస్ట్రేషన్‌, రుణాలు వంటి లావాదేవీలు నిలిచిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

– సర్వే నంబర్‌ తప్పు అయితే.. పట్టా భూములెందుకు బ్లాక్‌..?

ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి, సీలింగ్‌ భూమి, ఇరిగేషన్‌ భూమితో పాటు పట్టా భూమి ఉన్నప్పుడు మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల నిజమైన పట్టాదారులు నష్టపోతున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? సీలింగ్‌ భూమి ఎంత..? సబ్‌డివిజన్‌ వారీగా లెక్క తేల్చండి. ప్రభుత్వ భూమిని మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచండి. అమాయకుల ఆస్తులను ఎందుకు బ్లాక్‌ చేస్తున్నారు..? అని ప్రశ్నించారు.

– 5,525 ఎకరాలపై శ్వేతపత్రం…

మంచిర్యాల జిల్లాలో సుమారు 5,525 ఎకరాల నాన్‌-అగ్రికల్చర్‌ భూములు 22ఏ జాబితాలో ఉన్నట్లు పేర్కొంటూ వాటిపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లు, ప్లాట్లు, దుకాణాలు, అపార్ట్‌మెంట్లు ఉన్న భూములు ఏ ప్రాతిపదికన నిషేధిత జాబితాలోకి వచ్చాయో చెప్పాలన్నారు. ఎప్పుడు చేర్చారు..? ఎవరి నివేదిక ఆధారంగా చేర్చారు..? పాత పట్టాలు, సేల్‌డీడ్లు పరిశీలించారా..? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

– ‘సారీ’ కాదు.. ఆస్తులు విడిపించాలి..

ప్రభుత్వం తప్పిదం జరిగిందని అంగీకరించడం లేదా క్షమాపణ చెప్పడం వల్ల ప్రజల సమస్య పరిష్కారం కాదని హరీశ్‌రావు అన్నారు. 22ఏ కారణంగా ఆస్తులను విక్రయించలేక, రుణాలు పొందలేక, పిల్లల చదువులు, కుటుంబ అవసరాల కోసం డబ్బు సమకూర్చుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తప్పు ఏ చేతితో జరిగిందో.. అదే చేతితో సరిచేయాలి. ప్రజలను దరఖాస్తుల పేరుతో తిప్పడం కాదు.. తప్పుగా చేర్చిన ఆస్తులను ప్రభుత్వం తానే గుర్తించి తొలగించాలి అని డిమాండ్‌ చేశారు.

– అధికారుల పాత్రపై విచారణ జరపాలి…

22ఏ జాబితా రూపకల్పనలో ఎవరి నివేదికలు కీలకంగా మారాయి? ఏ ప్రాతిపదికన ఆస్తులను చేర్చారు..? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. జిల్లా నుంచి ప్రభుత్వానికి వెళ్లిన నివేదికలు, సంబంధిత సర్వే నంబర్లు, చేర్చిన భూములు, తొలగించిన భూముల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరింది.

– రాష్ట్రవ్యాప్తంగా వైట్‌పేపర్‌ ఇవ్వాలి…

22ఏ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వైట్‌పేపర్‌ విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. జిల్లా వారీగా ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలోకి వచ్చాయి..? ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి..? ఎన్ని ఇళ్లు, ప్లాట్లు, దుకాణాలు ప్రభావితమయ్యాయి..? ఎన్ని తొలగించారు..? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి..? అనే పూర్తి లెక్కను ప్రజల ముందుంచాలని అన్నారు.

– 10 వేల కుటుంబాలతో కలెక్టరేట్‌ ముట్టడి

మంచిర్యాలలో 22ఏ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరించారు. అవసరమైతే 10 వేల కుటుంబాలతో మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు.

– అసెంబ్లీలో సర్కారును నిలదీస్తాం…

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని హరీశ్‌రావు తెలిపారు. బాధిత ప్రజల ఆస్తులకు చట్టబద్ధమైన హక్కులు పునరుద్ధరించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 22ఏ బాధితులు, ఆశా వర్కర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.