కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి
శెనార్తిమీడియా, రామడుగు :
ఎల్నినో నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగుచేయాలని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో వ్యవసాయ శాఖ, కేవీకే ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా నేల ఆరోగ్య పరిరక్షణపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో నేల ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని, భూసారం తగ్గకుండా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందన్నారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని నేల పరీక్షల ఆధారంగా సమతుల్యంగా చేపట్టాలని, సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. పంటల మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా నేలలో పోషక సమతుల్యతను కాపాడుకోవచ్చని వివరించారు. ఎల్నినో ప్రభావం దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశెనగ, సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక, విత్తనాల ఎంపిక చేపట్టాలని కోరారు. వ్యవసాయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నేల ఆరోగ్య పరిరక్షణ, నీటి పొదుపు, పంటల వైవిధ్యీకరణ, సేంద్రియ వ్యవసాయం వంటి పద్ధతులను రైతులు ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం.ప్రభావతి, ఏఈవో శిరీష, సర్పంచ్ వీర్ల నర్సింగారావు, ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

