రైతులకు ఎస్సై కె.శేఖర్ రెడ్డి హెచ్చరిక.. ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై కేసు
శెనార్తి మీడియా, శంకరపట్నం
ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులను వినియోగించడం వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పను తప్పించబోయి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు కారణమైన అంతడుపుల పోచయ్యతో పాటు మరో వాహనదారుడు తాటిపాముల వెంకటేష్పై కేశవపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్పల్లికి చెందిన సూరం రాజన్ బాబు ద్విచక్ర వాహనంపై ఆముదాలపల్లి నుంచి మెట్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో పోచయ్య రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉంచాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన పోతిరెడ్డిపేట్కు చెందిన వెంకటేష్ వడ్ల కుప్పను తప్పించబోయి వాహనాన్ని ఒక్కసారిగా కుడివైపునకు తిప్పాడు. దీంతో రాజన్ బాబు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి తరఫున సూరం సాయి వరుణ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరి కోతల సీజన్లో రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులను వినియోగించవద్దని కేశవపట్నం ఎస్సై కె.శేఖర్ రెడ్డి సూచించారు. వడ్లు, మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టడం వల్ల వాహనదారులు అదుపు కోల్పోయి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది ఎరడపల్లి రోడ్డులో ఇలాంటి ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోమాలో ఉన్నారని గుర్తుచేశారు. రైతులు ధాన్యాన్ని కల్లాలు, సొంత స్థలాల్లోనే ఆరబెట్టుకోవాలని, రహదారులపై ధాన్యం కుప్పలు పోసి రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని కోరారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబానికి తీరని నష్టం కలిగించకూడదని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.


