Tuesday, November 17, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

📰 Generate e-Paper Clip

చొప్పదండిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, చొప్పదండి :

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపి రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో చొప్పదండి మున్సిపాలిటీ, మండల పరిధిలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి సోమవారం ఆయన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. 2018 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సుమారు 4.60 లక్షల పింఛన్లు మంజూరు చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. చొప్పదండి మున్సిపాలిటీలో 424 మందికి, చొప్పదండి మండలంలో 490 మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనమన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రభుత్వ పథకాల ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధితోపాటు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని వివరించారు. గుడి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో దృఢ సంకల్పంతో పేదలు, మహిళలు రైతుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతున్నదని పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. పింఛన్ల కోసం ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉండేవని, జిల్లావ్యాప్తంగా సుమారు 24 వేల దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి విచారణ నిర్వహించి, పారదర్శక పరిశీలన అనంతరం 14,834 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకూడదనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపుతున్నారని ప్రశంసించారు. చొప్పదండి మున్సిపాలిటీ, చొప్పదండి మండలం, రామడుగు, గంగాధర  పరిధిలో 2,545 మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పలువురు ప్రజా ప్రతినిధులు పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారని, దీంతోపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో కూడా పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌ పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్‌ పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మనోహర్, తహసీల్దార్ నవీన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ అక్బర్, పలువురు సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.