- 29న అలుగునూరులో దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు సాగిన ఉద్యమ చరిత్రను యువతకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించే దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరారు. బుధవారం శంకరపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఏర్పాటుతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక లభించిందన్నారు. 32 రాజకీయ పార్టీల మద్దతు కోరగా 28 పార్టీలు అనుకూలంగా లేఖలు ఇచ్చినా కేంద్రం రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని గుర్తుచేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు బయలుదేరగా, అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని తెలిపారు. అనంతరం నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ఉద్యమంలో పెద్దఎత్తున భాగస్వాములయ్యాయని చెప్పారు.
ఉద్యమ ఉధృతితో డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించినా, అదే నెల 23న వెనక్కి తగ్గిందన్నారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చి సుమారు 1,200 మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రైల్ రోకో వంటి పోరాటాలు సాగాయని, వీటి ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.
ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే దీక్షా దివస్ సభను చలి తీవ్రత దృష్ట్యా 6 గంటల్లోగా ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, యాదగిరి, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

