శెనార్తి మీడియా, శంకరపట్నం:
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బియ్యం అందిస్తున్నట్లు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆదివారం శంకరపట్నం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను కూడా విధిగా ముద్రించాలని డిమాండ్ చేశారు. పేదలకు అందిస్తున్న బియ్యంలో సింహభాగం ఐదు కిలోలను కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నందున, కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు మాత్రమే ముద్రించడం సరికాదన్నారు.
కేంద్రం అందిస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రజల్లో భ్రమలు కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బీజేపీ నాయకుడు ప్రవీణ్‌రావు తీవ్రంగా విమర్శించారు. రేషన్, సంక్షేమ కార్డుల విషయంలో అనవసర రాజకీయాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, సీనియర్ నాయకులు దొంగల రాములు, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్, నిమ్మచెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, చెర్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, కనకం కుమార్, గూళ్ల రాజు, వడ్లకొండ రాజేందర్, మొలుగూరి ప్రశాంత్, మెడిశెట్టి రాజేష్, గొల్లపల్లి వెంకటేష్, బొంతల రవి తదితరులు పాల్గొన్నారు.

