Tuesday, August 18, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్కల్యాణలక్ష్మి రద్దు చేస్తే బుద్ధి చెబుతారు

కల్యాణలక్ష్మి రద్దు చేస్తే బుద్ధి చెబుతారు

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆరోపణలు

శెనార్తి మీడియా, శంకరపట్నం:

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు లేదా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. అదే సమయంలో రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పరిరక్షణకు మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టినట్లు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ‘ఆడబిడ్డ భారం కాదు.. భరోసా’ అనే భావనకు ఈ పథకాల ద్వారా రూపం ఇచ్చిందన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం ఆర్థిక భారంగా మారకుండా అండగా నిలిచిన పథకాలను నిర్వీర్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశంపై ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అనంతరం కేశవపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని చెరువుల మట్టిని రైతుల పంట పొలాలకు తరలించేందుకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, రైతుల పేరుతో సుమారు 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇతరులకు తరలించారని రసమయి ఆరోపించారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించే చెరువులను మట్టి మాఫియాకు అప్పగించారని విమర్శించారు.

కల్వల ప్రాజెక్టుకు గండి పడి రైతులు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించిన రహదారుల్లో ఒక్కదానికి కూడా మరమ్మతులు చేయలేదని, మండలంలోని గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారాయని పేర్కొన్నారు. పోతిరెడ్డిపేట రోడ్డుకు రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పి, ప్రస్తుతం ఉన్న పథకాలను కూడా సక్రమంగా అమలు చేయలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని అన్నారు.

అంతకుముందు రసమయి బాలకిషన్ రాజాపూర్, కాచాపూర్, గద్దపాక, కన్నాపూర్, కేశవపట్నం గ్రామాల్లో పర్యటించి వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సంజీవరెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.