Monday, July 27, 2026
📄 ePaper
Homeభక్తికొమురవెల్లికి రైలు సౌకర్యం

కొమురవెల్లికి రైలు సౌకర్యం

📰 Generate e-Paper Clip

  • దశాబ్దాల నిరీక్షణకు తెర..
  • భక్తులకు నేటి నుంచి కొత్త ప్రయాణం
  • నాలుగు డెమో రైళ్లకు హాల్టింగ్ ఏర్పాటు

తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇకపై రైలు ప్రయాణం కూడా అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ ఎం. రఘునందన్‌రావు ఈ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. ప్రారంభం రోజునే సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో నడిచే నాలుగు డెమో రైళ్లకు కొమురవెల్లిలో నిలుపుదల కల్పించనున్నారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, మహాశివరాత్రి వంటి ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. ఇప్పటి వరకు నేరుగా రైల్వే సౌకర్యం లేకపోవడంతో యాత్రికులు సమీప పట్టణాల వరకు రైలులో వచ్చి, అక్కడి నుంచి బస్సులు లేదా ఇతర వాహనాలపై ఆలయానికి చేరుకోవాల్సి వచ్చేది. కొత్త స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఈ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.

భక్తుల ప్రయాణానికి మరింత సౌలభ్యం

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభంతో రైలు దిగిన కొద్ది వ్యవధిలోనే ఆలయానికి చేరుకునే అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఈ సౌకర్యం మరింత ఉపయోగకరంగా ఉండనుంది.

నాలుగు రైళ్లకు హాల్టింగ్

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు నెం. 77654 మధ్యాహ్నం 2.38 గంటలకు, సికింద్రాబాద్–సిద్దిపేట రైలు నెం. 77655 రాత్రి 8.04 గంటలకు కొమురవెల్లిలో ఆగుతుంది. అలాగే రైలు నెం. 77656 ఉదయం 7.04 గంటలకు, రైలు నెం. 77653 మధ్యాహ్నం 12.52 గంటలకు స్టేషన్‌లో నిలుస్తాయి. దీంతో రోజులో వివిధ సమయాల్లో భక్తులకు రాకపోకల సౌకర్యం లభించనుంది.

ఆధునిక వసతులతో స్టేషన్

సుమారు రూ.5.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్‌లో హై లెవల్ ప్లాట్‌ఫారమ్, విశాలమైన షెల్టర్లు, నిరీక్షణ మందిరం, టికెట్ కౌంటర్లు, తాగునీటి సదుపాయం, మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ముఖద్వారం స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించగా, మల్లన్న వైభవాన్ని చాటిచెప్పే మ్యూరల్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రాంతీయ అభివృద్ధికి ఊతం

రాజీవ్ రహదారికి సమీపంలో స్టేషన్ ఉండటంతో ఆలయానికి రవాణా అనుసంధానం మరింత మెరుగుపడనుంది. రైల్వే స్టేషన్ ప్రారంభం వల్ల భక్తుల రాక పెరగడంతో స్థానిక హోటళ్లు, లాడ్జీలు, ఆటో, క్యాబ్ సేవలు, చిన్న వ్యాపారాలకు ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయాణికుల రైళ్లకు కూడా ఇక్కడ నిలుపుదల కల్పిస్తే కొమురవెల్లి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది

– శెనార్తి మీడియా, కొమురవెల్లి/హైదరాబాద్ 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.