శెనార్తి మీడియా, మంచిర్యాల: దండేపల్లి మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అంజమ్మ సప్లిమెంటరీ పరీక్ష రాసినా ఫెయిల్ చేసిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థినికి న్యాయం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరీక్షకు హాజరైన విద్యార్థినిని గైర్హాజరైనట్లు జిల్లా ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు కలెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేయడం బాధాకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తే, విద్యార్థిని తల్లి సిద్ధి మల్లేశ్వరి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్, విలేకరి అనిష్, దండేపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్‌పై కేసులు నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు.
పరీక్షా కేంద్రంలో జరిగిన పొరపాటును కప్పిపుచ్చేందుకు విద్యార్థినిని మానసికంగా వేధించారని ఆరోపించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన అధికారులు అంజమ్మ పరీక్ష రాసినట్లు నిర్ధారించి మెమో జారీ చేశారని గుర్తు చేశారు.
గత నెల రోజులుగా జరిగిన తప్పుడు ప్రచారం వల్ల విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైందని, దీనికి బాధ్యులెవరో ప్రభుత్వం తేల్చాలని కోరారు. తప్పుడు నివేదిక సమర్పించిన చీఫ్ సూపరింటెండెంట్, కోఆర్డినేటర్, ఇన్విజిలేటర్, శాఖాధికారులతో పాటు క్షేత్రస్థాయి విచారణ లేకుండా ప్రకటన చేసిన ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బాధిత విద్యార్థిని అంజమ్మ, ఆమె తల్లి మల్లేశ్వరి, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్, పట్టణ అధ్యక్షుడు కె. కార్తీక్, వంశీ పాల్గొన్నారు.

