Wednesday, July 29, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి

బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, మంచిర్యాల: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రస్తుతం పాలనలో ఉన్న బీజేపీ కూడా బిల్లును ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీల్లో 32 పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయని, 11 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపినా ఇప్పటికీ బిల్లు తీసుకురాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

దేశ జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రవర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం, జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించకపోవడం వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. దేశంలో సామాజిక న్యాయం నెలకొనాలంటే “ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత” అనే సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసనలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, శాకపూర్ భీమ్సేన్, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, గగ్గూరి రాజన్న, మహమ్మద్ లతీఫ్, సీనియర్ న్యాయవాది కర్రే లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.