శెనార్తిమీడియా, కరీంనగర్ :
ప్రధానమంత్రి ఈ-విద్య డీటీహెచ్ ఛానళ్ల కోసం విద్యా సంబంధిత కంటెంట్ ను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ టీ-హబ్ లో టీశాట్ టీవీ ఛానల్ సహకారంతో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ, సీఐఈటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికై శిక్షణలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం జడ్పీహెచ్ఎస్ టీచర్ వినయాధర్ రాజు, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన ఎండీ.షరీఫ్ అహ్మద్, చిగురుమామిడి మోడల్ స్కూల్ కు చెందిన సయ్యద్ ఇర్షాద్ అలి పాల్గొని నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో ప్రధానమంత్రి ఈ-విద్య ఛానళ్లకు అవసరమైన కంటెంట్ రూపకల్పన, డిజిటల్ బోధనా వనరుల అభివృద్ధి, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను వీడియో రూపంలో రూపొందించడం వంటి అంశాలపై శిక్షణ పొందారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను ఎన్సీఈఆర్టీ తెలంగాణ డైరెక్టర్ గాజర్ల రమేశ్ అభినందించి, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను ఆయన కొనియాడారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అమోఘమని ప్రశంసించారు. డిజిటల్ విద్యా వనరుల అభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యాయులు జాతీయ స్థాయి విద్యా కంటెంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు జిల్లా అధికారులు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.

