Friday, October 16, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్అనాథ పిల్లలకు ఆప్యాయతల ఆలయం

అనాథ పిల్లలకు ఆప్యాయతల ఆలయం

📰 Generate e-Paper Clip

ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా సుంకె రవిశంకర్​

శెనార్తిమీడియా, గంగాధర :

అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనుకునే ఈ రోజుల్లో అధికారంలో లేకున్నా తనను నమ్ముకున్న వారిని అక్కున చేర్చుకోవడమే తన బాధ్యతగా భావిస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పదవి లేకున్నా తనలోని మానవత్వం మారదని మరోసారి నిరూపించుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆయన అందిస్తున్న ఆప్యాయత, భరోసా, సహాయం చూస్తే రక్తసంబంధం లేకున్నా మనసుతో ఏర్పడే బంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా అనాథ పిల్లలను గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెట్టి, వారితో కలిసి భోజనం చేయడం సుంకె రవిశంకర్ దంపతులకు ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది కూడా తన నివాసంలో భార్య దీవెనతో కలిసి పిల్లలకు కొత్త బట్టలు అందించి, స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.

కన్నీళ్లు తుడిచి.. తండ్రిలా భరోసా ఇచ్చి..

తల్లిదండ్రులు లేని పిల్లలకు పండుగ రోజుల్లో ఇతరుల ఇళ్లలో కనిపించే సందడి తమ జీవితాల్లో లేదనే బాధ ఉండొచ్చు. అలాంటి చిన్నారులు తనను చూడగానే భావోద్వేగానికి గురికావడం చూసిన రవిశంకర్ వారిని దగ్గరకు తీసుకుని కంటతడి తుడిచారు. ‘మీకు నేనే తండ్రిని.. ఇది మీ ఇల్లు. నా ఊపిరి ఉన్నంతకాలం మిమ్మల్ని నా సొంత పిల్లల్లా ప్రేమిస్తా.. ఆదరిస్తా..’ అంటూ భరోసా ఇచ్చారు. జీవితంలో ఏ అవసరం వచ్చినా, ఎప్పుడైనా తన దగ్గరకు రావచ్చని, ఏ సమస్య ఉన్నా ఒక తండ్రిలా తనకు చెప్పుకోవాలని ధైర్యం చెప్పారు.

ఆర్థిక సాయమే కాదు.. భవిష్యత్తుకూ అండ

రవిశంకర్ సేవలు పండుగ రోజున బట్టలు పెట్టడం, భోజనం పెట్టడంతోనే ఆగిపోలేదు. తల్లిదండ్రులను కోల్పోయి నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న చిన్నారుల పరిస్థితిని తెలుసుకుని తనవంతుగా ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఎన్నారైలు, స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో మరింత సాయం అందేలా కృషిచేశారు. పిల్లల చదువు, నివాసం, ఉపాధి, భవిష్యత్తు వంటి అంశాలపై శ్రద్ధ చూపుతూ వారికి జీవితంపై ఆశ కల్పించారు. చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన నేరెళ్ల సమత, మమత నివసించడానికి ఇల్లు లేక టెంట్ కింద ఉంటున్న పరిస్థితిని చూసి చలించిపోయి, తనవంతుగా రూ.20 వేలు సాయం అందించడంతో పాటు ఎన్నారైల సహకారంతో రూ.15 లక్షలు సేకరించి వారికి అందించారు. ఇల్లు, చదువు, ఉపాధి విషయంలోనూ సహాయ, సహకారాలు అందించారు. అలాగే పలువురు అనాథ పిల్లలకు తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తూ అవసరమైన చోట దాతల సహకారాన్ని కూడగడుతూ అండగా నిలిచారు.

 పదవి కంటే మానవత్వం గొప్పది..

రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. అధికారం ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండదు. కానీ మనిషి చేసే మంచి పనులు, కష్టాల్లో ఉన్నవారికి అందించే చేయూత వారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సుంకె రవిశంకర్ చేస్తున్న సేవలు కూడా అదే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. తన సొంత బిడ్డలతో సమానంగా అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని, వారి అవసరాలను తనవిగా భావిస్తూ, పండుగ పూట వారి ముఖాల్లో చిరునవ్వులు చూడాలనుకోవడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారులకు తండ్రిలా ఆదరిస్తూ వారి జీవితాల్లో ఆశాకిరణంగా మారుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.